Monday, 1 January 2018

నా ప్రపంచం

నాలో ప్రపంచం , నా ప్రపంచం
నా ఒంటరితనం , నా స్వాతంత్రం
వేల మందలో ఒంటరిని నేను
ఒంటరి నేను , ఆనందం నేను

నా ప్రపంచానికి ఊపిరి పుస్తకాలు
నా ఆలోచనలకి ఇంధనం పుస్తకాలు
బాహ్య ప్రపంచానికి దారులు ఈ పుస్తకాలు
నాలో ప్రపంచానికి మార్గదర్శకాలు పుస్తకాలు

గమ్యం లేని ప్రయాణాలెన్నో
అడుగులు తడబడిన క్షణాలెన్నో
ప్రతీ అడుగు ప్రపంచ దర్శనానికే
ప్రతీ దర్శనం , నా ప్రపంచపు దాహం తీర్చడానికే

ఆనందం కోసం వెతుకులాట
నా ప్రపంచం ముంగిట్లో ముగుస్తుంది
నా ఆనందానికి కారణం నా ప్రపంచం
నా ఆనందానికి చిరునామా నా ప్రపంచం

ఆస్తికుడను కాను , నాస్తికుడను కాను
దేవుడి గురించి ఆలోచించను , చర్చించను
బాహ్య ప్రపంచపు పోకడలకు చలించను
సముద్రం తడపలేని తామరాకును నేను

----------------------------------------------------------------------------------


ఎక్కడి నుంచో వచ్చింది ఆ మేఘం
చూడగానే మనసు మురిసిపోయింది
తన చినుకుల్లో నన్ను తడిపేసింది
ఊసెరుగని వింత ఆనందాన్ని పరిచయం చేసింది

మదిలో చిన్న ఆశ
నా ప్రపంచానికి తనని పరిచయం చెయ్యాలని
తన జడివానతో నా ప్రపంచాన్ని తడిపెయ్యాలని
ఆశే తపనై నా ప్రపంచపు తలుపులు తెరిసింది

వెర్రి వాడిని .. సముద్రం తడపలేదని విర్రవీగా
చిన్ని మేఘానికే తడిసిపోయా
పసి పాపలా వర్షంలో గంతులేసా
అంతెరుగని ఆనందంలో చిందులేసా

ఈ ఆనందం శాశ్వతం అనుకున్నా
మేఘాల లక్షణం మర్చిపోయా
తన ప్రస్థానానికి గమ్యం నేననుకున్నా
ఒక మజిలీగా మిగిలిపోయా


------------------------------------------------------------------------------------------------------


నాలో ప్రపంచం , నా ప్రపంచం 
నా ఒంటరితనం , నా శాపం 
వేల మందలో ఒంటరిని నేను 
ఒంటరి నేను ,ఒంటరిని నేను
 
గమ్యం లేని ప్రయాణాలు 
అలుపెరగని ప్రయాసలు 
అన్నీ .. ఆవేదనని దాచడానికి 
అన్నీ .. ఆనందం కోసం వెతుకులాటలే 

ఆనందం కోసం ఈ వెతుకులాట 
ఏ ముంగిట్లో ముగుస్తుందో ?
నా ఆవేదనికి కారణం నా ప్రపంచం 
నాలో వేదనకి చిరునామా నా ప్రపంచం 

తడిసిన నా ప్రపంచాన్ని ఓదార్చేది ఎలా ?
కోలుకుంటుంది అనుకున్న నా ప్రపంచం 
జారిన నా కన్నీటిలో మళ్లీ తుడుస్తుంటే 
కన్నీటి ధారని ఆపేది ఎలా ?

తడిసిన నా ప్రపంచాన్ని ఓదార్చాలా ?
లేక సమాధి చేసి నన్ను నేను కోల్పోవాలా ?
ఎన్నో ప్రశ్నలు .. అన్నింటి లక్ష్యం ఒక్కటే 
చేజారిన ఆనందాన్ని నా ప్రపంచానికి మళ్లీ పరిచయం చేసేది ఎలా ?

No comments:

Post a Comment